సలహా

  • 1421 Views
  • 59Likes
  • Like
  • Article Share

సలహా

కార్ల తయారీ సంస్థ యజమాని ఒకరు తమ దగ్గర పనిచేస్తున్న ఇంజినీరుకు ఓ మంచి కారును రూపొందించే పని అప్పజెప్పాడు. ఆ ఇంజినీరు బాగా కష్టపడి అద్భుతమైన కారును తయారుచేశాడు. యజమాని వచ్చి దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.. ఆనందించాడు. ఆ ఇంజినీరు పనితనాన్ని చాలా మెచ్చుకున్నాడు. కారును షెడ్డులోంచి బయటికి తీసుకురమ్మని పురమాయించాడు. సిబ్బంది ఆ పనిచేయబోతే చిన్న అడ్డంకి! ఆ ద్వారం ఎత్తు కన్నా కారు కొన్ని అంగుళాలు ఎక్కువగా ఉంది. కారు తయారుచేసేటప్పుడు ఆ విషయాన్ని గమనించలేకపోయినందుకు ఇంజనీరు లోలోన బాధపడసాగాడు. ఆ షెడ్డు నుంచి కారును బయటికి ఎలా తీసుకురావాలా అని యజమాని ఆలోచించసాగాడు. 
      ‘‘కారును బలవంతంగా అలాగే బయటికి తెద్దాం. పైన గీతలు, నొక్కులు పడితే తర్వాత బాగుచేసుకుందాం’’ అని సలహా ఇచ్చాడు అక్కడే ఉన్న పెయింటర్‌. ‘‘ప్రవేశద్వారం పైన పగలగొట్టి కారును బయటికి తెద్దాం. తర్వాత దానికి మరమ్మతులు చేసుకోవచ్చు’’ అని చెప్పాడు ఇంజినీరు. 
యజమానికి ఆ రెండు సలహాలు నచ్చలేదు. మంచి కారు తయారుచేసి తీరా దానికి గీతలు, నొక్కులు పడటం, ద్వారాన్ని పగలగొట్టడం ఆయనకి మంచి శకునంగా అనిపించలేదు. 
      ఇదంతా చూస్తూ అక్కడే ఉన్న వాచ్‌మన్‌ భయం భయంగా ముందుకొచ్చి ‘‘నాదొక చిన్న సలహా అండీ’’ అని అన్నాడు. ఇక్కడున్న నిపుణులే ఇవ్వలేని సలహా అతనేమిస్తాడా అని అందరూ వేళాకోళంగా చూస్తున్నారు. ‘‘కారును బయటికి తేవడం చాలా తేలికసార్‌. కారు ద్వారం ఎత్తుకన్నా కొంచెమే కదా ఎత్తుగా ఉంది. కారు టైర్లలోని గాలి తీసేసి బయటికి తెచ్చి మళ్లీ టైర్లలో గాలి నింపితే సరి’’ అని అన్నాడా వాచ్‌మన్‌. 
      అంతే! చప్పట్ల వర్షం కురిసింది. 


* * * 

చాలా సమస్యలకు ఒక్కోసారి సామాన్యులు కూడా చక్కని పరిష్కార మార్గాలు చూపించగలరు. అయితే వాళ్లని తక్కువగా చూడకుండా, ముందు వాళ్ల మాటలు వినే పెద్దమనసు ఎదుటి వ్యక్తుల్లో ఉండాలి. 

సేకరణ: వేదాంతం సూర్యసుజాత, రాజోలు

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు