వివేకం

  • 1136 Views
  • 9Likes
  • Like
  • Article Share

వివేకం

ఓ వ్యక్తి చిలుకను పంజరంలో ఉంచి పోషిస్తూ ఉండేవాడు. అతను రోజూ ఆ పట్టణంలో జరిగే సత్సంగానికి వెళ్తుండేవాడు. ఒక రోజు చిలుక తన యజమానిని అడిగింది, ‘‘మీరు రోజూ ఎక్కడికి వెళ్తున్నారు?’’ అని.
      ‘‘మంచి విషయాలు తెలుసుకోవడానికి సత్సంగానికి వెళ్తున్నాను’’ అన్నాడు. 
      ‘‘మీరు నాకు ఓ సాయం చేయగలరా? నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలనో మీ గురువుగారిని అడిగి చెప్పగలరా’’ అని అడిగింది చిలుక. 
      అతను ‘‘సరే’’ అన్నాడు. ఆ రోజు సత్సంగం ముగిసిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్లి, ‘‘మహరాజ్, మా ఇంట్లో ఓ చిలుక ఉంది. అది స్వేచ్ఛ ఎప్పుడు పొందుతుందో మిమ్మల్ని అడగమంది’’ అన్నాడు.
      అది విన్న వెంటనే గురువుగారు స్పృహతప్పినట్లు వాలిపోయారు. 
      చిలుక యజమాని కంగారుపడ్డాడు. గురువుకి శిష్యులు సపర్యలు చేస్తుండగా అక్కడి నుంచి వచ్చేశాడు.
      ఇంటికి రాగానే ‘‘గురువుగారిని నా ప్రశ్న అడిగారా?’’ అంది చిలుక. 
      యజమాని జరిగిందంతా చెప్పాడు. 
      తర్వాతి రోజు అతను సత్సంగానికి వెళ్తుంటే పంజరంలో చిలుక అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే దాన్ని పంజరం నుంచి బయటికి తీసి కింద ఉంచాడు. అంతే, అకస్మాత్తుగా అది రివ్వున ఎగిరిపోయింది. యజమాని అవాక్కయ్యాడు. చేసేది లేక మామూలుగా సత్సంగానికి వెళ్లాడు. 
      గురువుగారు అతణ్ని దగ్గరికి పిలిచి, ‘‘నీ చిలుక ఎలా ఉంది?’’ అని అడిగారు.
      ఆ యజమాని దిగాలుగా జరిగింది చెప్పాడు. 
      గురువుగారు చిరునవ్వు నవ్వి ‘‘నీ చిట్టి చిలుక చాలా తెలివైంది. నా సూచనను చక్కగా అర్థం చేసుకుని, ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందింది. కానీ, నువ్వు మాత్రం చాలా రోజులుగా సత్సంగానికి వస్తూ కూడా నేర్చుకున్నదేమీ లేదు. నాది, నేను అనే భ్రమలో ఉండి స్వేచ్ఛగా విహరించాల్సిన పక్షిని పంజరంలో బంధించావు. సత్సంగం కేవలం కాలక్షేపం కోసం కాదు. అజ్ఞానం, అంధకారం, భ్రమ నుంచి విముక్తమై దైవానికి చేరువకావడం కోసం. సకల ప్రాణుల మీద ప్రేమ భావాన్ని పెంపొందించుకోవడం కోసం’’ అన్నారు. 
      యజమాని సిగ్గుతో తలదించుకున్నాడు. 

సేకరణ: కట్టెకోల చిన నరసయ్య, ఖమ్మం 
 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు