జీవిత సత్యం

  • 2308 Views
  • 33Likes
  • Like
  • Article Share

జీవిత సత్యం

ఇంటి గుమ్మం ముందు కూర్చొని బియ్యంలో రాళ్లు ఏరుతోంది అమ్మ. కొడుకు పక్కనే కూర్చుని చదువుకుంటున్నాడు. అంతలో అక్కడికి ఆకుకూరలమ్మే ఒకామె వచ్చింది. ‘‘ఆకుకూర కట్ట ఎంత?’’ అడిగింది అమ్మ. ‘‘అయిదు రూపాయలు’’ చెప్పిందామె. 
‘‘నాలుగు కట్టలు తీసుకుంటాను. కట్ట మూడు రూపాయలు చేసివ్వు’’ 
‘‘నాకు గిట్టదమ్మా...’’ అని ఆకుకూరామె గంప తీసుకొని బయలుదేరింది. అయితే నాలుగడుగులు వేసి మళ్లీ వెనక్కి తిరిగి ‘‘అమ్మా, కట్ట నాలుగు చేసుకోండి’’ అంది. 
‘‘కుదరదు. మూడంటే మూడే’’ అందా అమ్మ.‘‘సరే’’ అని ఆమె ఆకుకూర ఇచ్చి వెళ్లబోతుంటే కొంచెం నీరసంగా ఉన్నట్లు అనిపించింది. 
‘‘ఏంటమ్మా, తినలేదా? నిస్సత్తువగా కనిపిస్తున్నావు’’ అమ్మ అడిగింది. 
‘‘లేదమ్మా. ఇవన్నీ అమ్మి ఇంటికెళ్లి వండుకొని తినాలి’’ అందా కూరలామె. 
‘‘సరేలే, ఇంత నీరసంలో ఆ గంప ఎత్తుకొని ఎక్కడ తిరుగుతావు. ఏమన్నా తిని వెళ్దువుగాని రా’’ అని అమ్మ ఆమెని ఇంట్లోకి తీసుకెళ్లి ఇడ్లీలు పెట్టింది. వాటిని తృప్తిగా తిని, గంప తీసుకొని ఆ కూరలమ్మి వెళ్లిపోయింది. 
ఇదంతా గమనిస్తున్న కొడుకు ‘‘అమ్మా, కూరాకు దగ్గర బేరం ఆడావు. కట్ట అయిదు రూపాయల చొప్పున నాలుగింటికి ఇరవై రూపాయలే అవుతుంది. కానీ, నువ్వు ఆమెకి ఆరు ఇడ్లీలు పెట్టావు. హోటల్‌ రేటు ప్రకారమైతే అవి ముప్పై రూపాయలు అవుతాయి కదా?!’’ అన్నాడు. 
‘‘కన్నా, వ్యాపారంలో దానధర్మాలు ఉండకూడదు. దానంలో వ్యాపారం చూడకూడదు’’ కొడుకు వైపు ప్రసన్నంగా చూస్తూ చెప్పిందా అమ్మ. 
ఆ మాటలతో కొడుకు మస్తిష్కంలో ఎక్కడో జ్ఞానజ్యోతి వెలిగింది. అది జీవితాంతం అతణ్ని మానవతామూర్తిగా నిలిపే దివ్య జ్యోతి. 

సేకరణ: అంబల్ల జనార్దన్, ముంబయి

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు