మనసొక పావురమై..

  • 3138 Views
  • 20Likes
  • Like
  • Article Share

మనసొక పావురమై..

ఒక ఊరిలో పాడుపడ్డ పాత గుడి గోపురాన్ని నివాసంగా చేసుకుని కొన్ని పావురాలు ప్రశాంతంగా ఉండేవి. ఒక రోజు కొందరు మనుషులు వచ్చి ఆ గుడిని బాగుపరిచి ఉత్సవం చేయాలని మరమ్మత్తు పనులు మొదలు పెట్టారు. వెంటనే పావురాలు గుడి గోపురాన్ని వదిలి కాస్త దూరంగా కనిపిస్తున్న చర్చి మీదికి చేరుకున్నాయి.
      ఆ చర్చి మీద ఎప్పటినుంచో నివసించే పావురాలు, ఈ పావురాలన్నింటికీ సాదరంగా ఆహ్వానం పలికాయి. తమతో పాటే ఉండమని అన్నాయి. పావురాలన్నీ చక్కగా సర్దుకున్నాయి. కొన్నాళ్లకు చర్చి గంటలు మోగడం ఎక్కువైంది. క్రిస్‌మస్‌ దగ్గర పడిందని జనం తాకిడి పెరిగింది. చర్చికి అలంకరణ చెయ్యాలని అనుకున్నారు. సరేలే అనుకుని పావురాలన్నీ మరో దిక్కున ఉన్న మసీదువైపు ఎగిరిపోయాయి.
       మసీదు మీద ఉన్న పావురాలు ఎగిరొస్తున్న ఈ పావురాలను చూసీ చూడటంతోనే సంతోషపడ్డాయి. వివరం తెలుసుకుని మసీదు మీద అందరికీ చోటు సరిపోతుందని చెప్పి ఊరడించాయి. ఏ దిగులూ లేకుండా హాయిగా అన్నీ కలిసిమెలిసి జీవించసాగాయి. ఇంతలో రంజాన్‌ మాసం వచ్చింది. మసీదుకు రంగులు వెయ్యాలని అనుకున్నారు జనం. పావురాలన్నీ కలిసి ఏంచెయ్యాలో మాటాడుకుని, మళ్లీ పాత గుడి మీదికి చేరుకున్నాయి. అన్నీ చక్కగా సర్దుకున్నాయి.
      ఓ రోజు ఆ ఊరి మార్కెట్‌ మధ్యలో మతకలహాల విధ్వంసం మొదలైంది. పిల్లలూ ఆడవాళ్లూ ముసలివాళ్లూ కేకలూ.. కత్తులకంటిన నెత్తురు ఎవరిదో తెలియటంలేదు. 
      గోపురం మీదినుంచి చూస్తున్న చిట్టిపావురం అడిగింది.. ‘అమ్మా ఎవరే వాళ్లూ?’
      ‘వాళ్లను మనుషులంటారు’ - అమ్మ చెప్పింది
      ‘ఎందుకా కొట్లాటలు?’ - మళ్లీ చిట్టిపావురం ప్రశ్న.
      ‘ఈ గుడికి వస్తారే, వాళ్లను హిందువులు అంటారు. చర్చికి వచ్చేవారిని చూశావు కదా, వాళ్లు క్రైస్తవులు. మసీదులోకి వెళ్లే వాళ్లు ముస్లింలు..’ - అమ్మ ఇంకా వివరించాలనుకుంది.
      ‘గుడి మీద ఉన్నా, చర్చిమీద ఉన్నా, మసీదు మీద ఉన్నా మనల్ని పావురాలనే అంటారు కదా.. మరి వాళ్లనెందుకు రకరకాలుగా పిలవడం? మనుషులని అనడంలేదేం?’ - చిట్టి పావురం అమాయకంగా అడిగింది.
      అమ్మ నవ్వి, ‘దైవం అనే భావన మనలో ఉంది కాబట్టే మనం వాళ్ల కంటే ఎత్తులో ప్రశాంతంగా ఉన్నాం. ఈ మనుషులకు అంత జ్ఞానం లేదు. అందుకే మనకంటే దిగువన ఉన్నారు. అలా కొట్టుకుంటూ దైవానికి దూరమవుతూనే ఉంటారు..’ అని చెప్పింది.
      చిట్టి పావురం కువకువమంటూ మార్కెట్‌ వైపు రెక్కలాడిస్తూ ఎగిరింది. పాపం అదేమీ చెయ్యలేదని దానికి ఇంకా తెలీదు! 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు