రెండు నాణేలు

  • 4569 Views
  • 57Likes
  • Like
  • Article Share

రెండు నాణేలు

అది ద్వాపరయుగం. ఓసారి కృష్ణార్జునులకు ఓ పేద బ్రాహ్మణుడు కనిపించాడు. జాలిపడిన అర్జునుడు అతనికి ఓ సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ బ్రాహ్మణుణ్ని మార్గమధ్యంలో ఓ దొంగ దోచుకున్నాడు. గతిలేక అతడు మళ్లీ వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.
      ఓరోజు అతణ్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ వజ్రం ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాడు. గదిలో మూలన ఉన్న కుండలో దాచిపెట్టి పడుకున్నాడు.
      తెల్లారింది. చూస్తే భార్య లేదు. ఆ కుండా లేదు. పరుగెత్తుకుంటూ నదీతీరం దగ్గరికి వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కానీ కుండలో వజ్రం లేదు. నదిలో నీళ్లకోసం కుండ వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.
      మళ్లీ కృష్ణార్జునులు అతణ్ని విచారించారు ఏమైందని. ‘‘ఇక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు’’ అన్నాడు అర్జునుడు. ‘‘లేదు అర్జునా. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం’’ అంటూ బ్రాహ్మణుడికి రెండు బంగారు నాణేలు ఇచ్చాడు శ్రీకృష్ణుడు. 
      ‘సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలువలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా...’ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఓ జాలరి వలకి చిక్కి విలవిల్లాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. 
      ‘ఈ రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి ప్రాణాలైనా రక్షిద్దాం’ అనుకుని నాణేలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ చేపను ఓ నీళ్ల గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసింది. ‘‘అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుందండీ’’ అంటూ భర్తని పిలిచింది. గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారిద్దరూ. అది నదిలో వాళ్లు జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై ‘‘దొరికింది... దొరికింది నా చేతికి చిక్కింది’’ అని గావుకేకలు పెట్టాడు ఆ బ్రాహ్మణుడు. 
అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన దొంగ కంగారుపడ్డాడు. ‘గతంలో ఈ బ్రాహ్మణుడి నుంచే బంగారు నాణేల సంచి దొంగిలించా, ఇప్పుడు అతను నన్ను గుర్తుపట్టినట్టున్నాడు. అందుకే నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు’ అనుకుని వణికిపోయాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి ‘‘నీ బంగారు నాణేలు నువ్వే తీసేసుకో. నన్ను మాత్రం రక్షకభటులకు పట్టివ్వద్దు’’ అని ప్రాధేయపడ్డాడు. 
      దంపతులు నివ్వెరపోయారు. పోగొట్టుకున్న రెండూ తిరిగి వచ్చాయి.  పరుగు పరుగున కృష్ణార్జునుల దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
      ‘‘కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నువ్విచ్చిన రెండు నాణేలూ అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది’’ అని ప్రశ్నించాడు అర్జునుడు.
      ‘‘అర్జునా, తన దగ్గర బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడ్డలు, ఈతిబాధలు, కష్టసుఖాల గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను’’ అని ముక్తాయించాడు శ్రీకృష్ణ పరమాత్మ.

సేకరణ: ఆవుల చక్రపాణి యాదవ్, కన్నమడకల, కర్నూలు జిల్లా 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు