స్వేచ్ఛ

  • 1347 Views
  • 0Likes
  • Like
  • Article Share

స్వేచ్ఛ

సమయం... రాత్రి 10 గంటలు!
వూరంతా షికార్లు తిరిగి అప్పుడే ఇంటికి చేరిన కొడుకును అమ్మానాన్నలు మందలించారు. తిరుగుళ్లు మాని చదువు మీద ధ్యాసపెట్టమని హితవు చెప్పారు.
      ‘‘చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకసలు స్వేచ్ఛ ఇవ్వట్లేదు మీరు. ఎంతసేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు. ఏం.. స్నేహితులతో గడపకూడదా? సినిమాలకి షికార్లకి పోకూడదా? అందరూ వెళ్లట్లేదా? ఓ గంట ఫోన్‌ మాట్లాడితే తప్పా? ఫేస్‌బుక్‌ చాటింగ్‌తో కొంపలేమన్నా మునుగుతాయా?’’ అసహనంతో చిందులు తొక్కాడు కొడుకు.
      ‘‘సరే... నీకు కావాల్సినంత స్వేచ్ఛనిస్తాం. ఒక్కసారి నా మాట వింటావా? ఈ ఆదివారం మన వూరు వెళ్లొద్దాం. వచ్చాక నీ ఇష్టం’’ అన్నాడు తండ్రి. కొడుకు సరే అన్నాడు.

* * *

      ‘‘నేను ఇక్కడే ఉంటాను. నువ్వెళ్లి తోటంతా చూసిరా’’ అన్నాడు తండ్రి. వూళ్లొని మామిడితోటను చూపించడానికి కొడుకును తీసుకుని వచ్చాడాయన.
      ఓ గంట తర్వాత కొడుకు తిరిగొచ్చాడు. ‘‘నాన్నా... ఇక్కడ అన్ని చెట్లూ బాగానే ఉన్నాయి. కానీ, ఒకటి మాత్రం పొట్టిగా, పురుగులు పట్టి, కాయలు లేకుండా ఉంది. ఏమైంది దానికి?’’ అని అడిగాడు.
      ‘‘మామిడిచెట్టును పెంచేటప్పుడు.. అది కొంత ఎత్తుకు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకు వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు. లేదంటే ఈ వేలాడే కొమ్మలకు ఎండ తగలక చెట్టు పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే, పురుగులూ చేరతాయి. అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించాం. అందుకే అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ ఆ చెట్టుకి కత్తిరించలేదు. మొదట నాటింది కదా స్వేచ్ఛగా పెరగనిద్దామని అలా వదిలేశాం’’ అన్నాడు తండ్రి.
      అబ్బాయికి విషయం అర్థమైంది.
      ‘‘అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే చెట్టుని నాశనం చేస్తాయో... అలాగే, చదువుకునే వయసులో చేసే అనవసర పనులు పిల్లల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు, చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని. అంతే కానీ, నీ స్వేచ్ఛని అడ్డుకోవాలని కాదు’’ అంటూ కొడుకు భుజంతట్టాడు తండ్రి.

* * *

      బిడ్డల బాగుకోసమే తల్లిదండ్రులు కాస్త కఠినంగా ఉంటారు. ఉన్నట్టు కనిపిస్తారు. కానీ, వాళ్ల మనసులు నవనీతాలు. అర్థం చేసుకున్న పిల్లలు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు.

సేకరణ: మాడిశెట్టి గోపాల్‌, కరీంనగర్‌

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు