మోహం

  • 2819 Views
  • 19Likes
  • Like
  • Article Share

మోహం

ఒక సాధువు దార్లో వెళుతూ అలసట అనిపించి చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురింట్లో ఉన్న గృహస్థు అతణ్ని ఆహ్వానించి భోజనం పెట్టాడు. మాటల్లో ‘‘ఏంటో స్వామీ ఈ సంసారం. ఇందులో సుఖం లేదు. మీ జీవితమే హాయి’’ అన్నాడు దిగాలుగా. ‘‘అయితే నాతో రా, మోక్ష మార్గం చూపిస్తా’’ అన్నాడు సాధువు.
      గృహస్థు కంగారుపడుతూ ‘‘అదెలా కుదురుతుంది? నా పిల్లలు చిన్నవాళ్లు. పెంచి పెద్ద చెయ్యాలి కదా’’ అన్నాడు. 
      సాధువు మారు మాట్లాడకుండా వెళ్లిపోయి కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ గృహస్థు దగ్గరికి వచ్చాడు. ‘‘పిల్లలు పెద్దయ్యారుగా. ఇప్పుడు రా’’ అన్నాడు. 
      ‘‘అయ్యో, వాళ్లు స్థిరపడాలి. పెళ్లిళ్లు చెయ్యాలి’’ అన్నాడతను. 
      మరికొన్నేళ్లకు సాధువు మళ్లీ వచ్చాడు. ఈసారి గృహస్థు కొంచెం చిరాగ్గా, ‘‘పిల్లలకి డబ్బు విలువ తెలియదు. అందుకే నేను సంపాదించిందంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను. వీలు చూసుకుని వాళ్లకి చెబుతాను’’ అన్నాడు. 
      ఇంకా కొన్నేళ్లకి సాధువు మళ్లీ అక్కడికి వచ్చాడు. తమ తండ్రి మరణించాడని పిల్లలు చెప్పారు. సాధువు చెట్టు కింద చూస్తే ఒక కుక్క కనిపించింది. ఆ గృహస్థు కుక్కగా పుట్టి దాచిపెట్టిన ధనానికి, ఇంటికి కాపలా కాస్తున్నాడని అర్థమైంది. 
      మంత్ర జలం దాని మీద చల్లి ‘‘ఇప్పటికైనా నా వెంట రా’’ అన్నాడు. ‘‘అయ్యో, డబ్బు దాచిన విషయం పిల్లలకు చెప్పలేదు. దీన్ని ఎవరూ దోచుకోకుండా చూడాలిగా’’ అన్నాడు. 
      మరి కొన్నేళ్ల తర్వాత సాధువు అటువైపు వస్తే ఆ కుక్క కూడా చనిపోయిందని తెలిసింది. చెట్టు కింద ఒక పాము కనిపించింది. అది కూడా ఆ గృహస్థే. మంత్ర జలం చల్లి ‘‘ఇంకా ఎంతకాలం ఇలా?’’ అన్నాడు. 
      ‘‘ఆ మాట మాత్రం అనకండి. దాచిన సొమ్ము పిల్లలకి దక్కాలి’’ అన్నాడు. 
      వెంటనే సాధువు అతని పిల్లల దగ్గరికెళ్లి ధనం విషయం, తండ్రి కాపలా గురించి చెబుతుండగానే వాళ్లు ఎగిరి గంతేసి చెట్టు కిందకొచ్చారు. పాముని చూసి కర్రలతో కొట్టి చంపారు. 

* * *

      గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు. కానీ, అవి ఎంతకాలం? ఈ సంసార మోహాన్ని చూసేనేమో ‘నాది నాదంటావు ఇల్లు నాదంటావు ఇల్లెక్కడున్నదే చిలకా...’ లాంటి తత్వాలు పుట్టుకొచ్చాయి.

సేకరణ: ఎం.వి.స్వామి,
చోడవరం, విశాఖ

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు