ఓ రోగికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉందంటూ ఫోను రాగానే ఓ వైద్యుడు, హడావుడిగా ఆసుపత్రికి వచ్చారు. బట్టలు మార్చుకుని తిన్నగా సర్జరీ బ్లాక్‌లోకి వెళ్లారు. అక్కడ రోగి తండ్రి ఎదురుచూస్తున్నాడు. వైద్యుణ్ని చూడగానే కోపంగా ‘‘ఇంత ఆలస్యమైందేంటి? నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు... మీకు కొంచెం కూడా బాధ్యత లేదా?’’ అన్నాడు.
‘‘క్షమించండి! నేను బయట ఉన్నాను... ఫోను రాగానే, నాకు సాధ్యమైనంత త్వరగానే వచ్చాను. మీరు స్థిమితపడి శాంతిస్తే... నేను సర్జరీకి వెళ్తా’’ అన్నాడు వైద్యుడు చిరునవ్వుతో.
‘‘శాంతపడాలా? నీ కొడుక్కే ఇలా జరిగి ఉంటే, నువ్వు ప్రశాంతంగా ఉండగలవా?’’
‘‘డాక్టర్లు ఎవరూ ఎవరి జీవిత కాలాన్నీ పొడిగించలేరు. మీరు మీ అబ్బాయికోసం దేవుణ్ని ప్రార్థించండి. నేను చేయాల్సింది నేను చేస్తాను’’... ఆ వైద్యుడి ముఖంమీద చిరునవ్వు చెరగలేదు.
‘‘మనది కానప్పుడు... సలహాలు ఇవ్వటం చాలా తేలికే’’ తండ్రి కోపంతో రగిలిపోయాడు.
* * *
కొంతసేపటి తర్వాత శస్త్రచికిత్స గది నుంచి ఆ వైద్యుడు బయటికి వచ్చాడు. ‘‘భగవంతుడికి ధన్యవాదాలు. మీ అబ్బాయి ఇప్పుడు క్షేమమే. ఏమన్నా అడగాలనుకుంటే మా నర్సుని అడగండి’’ అని ఆ తండ్రి సమాధానంకోసం ఆగకుండా వెళ్లిపోయాడు.
‘‘ఈ డాక్టర్ ఇంత కఠినాత్ముడేంటి!? కొన్ని నిమిషాలు ఆగి మాట్లాడితే ఈయన సొమ్మేం పోయింది’’ అని బయటికి అనేశాడు తండ్రి. అక్కడే ఉన్న నర్సు అది విని, కన్నీళ్లతో... ‘‘ఆ డాక్టర్ గారి అబ్బాయి నిన్ననే ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మేము ఆయనకు ఫోన్ చేసినప్పుడు... శ్మశానం దగ్గర ఉన్నారు. మధ్యలో వచ్చి మీ అబ్బాయికి శస్త్రచికిత్స చేసి, మిగిలిన సంస్కారాలు పూర్తి చేయడానికి... మళ్లీ శ్మశానానికి వెళ్లారు’’ అని చెప్పింది.
ఆ తండ్రికి నోట మాట లేదు!!
అందుకే పెద్దలంటారు... ఎదుటివారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎప్పుడూ విమర్శించకూడదని!!
సేకరణ: రామిరెడ్డి, మెదక్