పాపం.. పుణ్యం

  • 1977 Views
  • 13Likes
  • Like
  • Article Share

పాపం.. పుణ్యం

వేదవతి రోజూ తన ఇంటి ప్రహరీగోడ మీద ఆకులో రెండు ఇడ్లీలు పెడుతుంది ఎవరైనా తింటారు కదా అని. ఆ దారివెంట వెళ్లే ఓ ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకుని ఏదో గొణుక్కుంటూ వెళ్లేవాడు. 
      అతనేం అనుకుంటున్నాడో విందామని ఓ రోజు గోడపక్కనే నిలబడింది వేదవతి. ‘‘నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది.. నువ్వు చేసే పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది’’ అంటున్నాడతను.
      రోజూ అతను ఈ మాటలే చెబుతున్నాడు. రోజూ ఇడ్లీలు తీసుకెళ్తున్నాడు. ‘నువ్వు మహాలక్ష్మివి చల్లగా ఉండమ్మా! అని చేతులెత్తి మొక్కకపోయినా పర్లేదు.. ఇడ్లీ బావున్నాయని చెప్పకపోయినా పర్లేదు.. కనీసం కృతజ్ఞతలు చెప్పడం కూడా తెలియదా ఇతనికి.. ఏదో ఆ చెత్తవాగుడు వాగిపోతున్నాడు’ అనుకుంది వేదవతి. అయినా ఇడ్లీలు పెట్టడం ఆపలేదు. 
      రోజు రోజుకి ఆమెకు అతని మీద కోపం పెరిగిపోతోంది. ఓరోజు ఆ ఇడ్లీల మీద కాస్త విషం చల్లి పెట్టబోయింది. కానీ మనసు ఒప్పుకోలేదు. ఆ ఆలోచన వచ్చినందుకు తనను తనే నిందించుకుంది. ఆనాడు కూడా అతను ఇడ్లీలు తీసుకెళ్తూ అవే మాటలు అనడంతో వేదవతికి మళ్లీ చిర్రెత్తింది. అయినా తనను తాను సమాధానపరచుకుంది. 
      ఆ రోజు మిట్టమధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టినట్టు ఉంటే వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా మురికి బట్టలతో ఓ యువకుడు.. ఎవరో కాదు చాలారోజుల కింద అలిగి ఇల్లొదిలి వెళ్లిన తన కొడుకు. ‘‘అమ్మా ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగలించేశారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆకలిలో కళ్లు తిరిగి పడిపోయాను. ఎవరో ఓ ముసలాయన ఇడ్లీలు ఇచ్చి నా ప్రాణాలు కాపాడాడు’’ అని చెప్పాడు.
      ఆ మాటలు వినగానే వేదవతికి వణుకు పుట్టేసింది. విషపు ఇడ్లీలు పెట్టుంటే నా కొడుకును నేనే చంపుకునే దాన్ని కదా అని కంటతడి పెట్టుకుంది. అప్పుడు ఆ ముసలాయన మాటలు అర్థమయ్యాయి. 
ధర్మో రక్షతి రక్షితః

సేకరణ: అంబళ్ల జనార్దన్, 
ముంబయి

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు