ఏదో పుస్తకం చదువుకుంటున్న తండ్రిని తన వరుస ప్రశ్నలతో విసిగిస్తోంది ఆరేళ్ల పాప. అమ్మాయికి ఏదైనా చెబితే తన జోలికి రాకుండా ఉంటుంది కదా అనుకున్నాడు ఆ తండ్రి. ఇంతలో ఆయనకు ఓ ఆలోచన తట్టింది.
పుస్తకాల అలమరలోంచి ప్రపంచ పటం బొమ్మను బయటికి తీశాడు తండ్రి. దాన్ని ముక్కలుగా చింపి, కూతురు చేతిలో పెట్టాడు. ‘అమ్మడూ! ఈ ముక్కల్ని సరిగ్గా అతికించి తీసుకురా... నీకు చాక్లెట్ ఇస్తా’ అన్నాడు.
పాప సంతోషంగా ఆ ముక్కలను తీసుకొని తన గదిలోకి వెళ్లిపోయింది. ముక్కలను సరిగ్గా గుర్తించి, అతికించడానికి చాలాసేపు పడుతుంది... అసలు తను అతికించగలదో లేదో అనుకుంటూ మళ్లీ పుస్తకంలో పడిపోయాడు తండ్రి.
కానీ, పాప పది నిమిషాల్లో తిరిగి వచ్చింది. చక్కగా అతికించిన ప్రపంచ పటం బొమ్మని నాన్నకి చూపించింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ‘ఇంత తొందరగా ఎలా చేయగలిగావురా’ అని అడిగాడు.
‘నాన్నా... ఈ ప్రపంచ పటం వెనుకవైపు రాముడి బొమ్మ ఉంది. నేను దాన్ని సరిగా అతికించాను. దాంతో ప్రపంచ పటం వచ్చేసింది’ అని నవ్వుతూ చెప్పింది ఆ పాప. తన కూతురు తెలివితేటలకు మురిసిపోయాడు ఆ తండ్రి.
* * *
ఎంతటి కఠిన సమస్యకైనా ఓ పరిష్కారం అంటూ ఉంటుంది. దాన్ని ఎంత తొందరగా గుర్తించగలం అన్న దానిమీదే మన విజయం ఆధారపడి ఉంటుంది. సమస్యకు భయపడి పరిష్కారం వెతికే ప్రయత్నం ఆపేస్తే మాత్రం పరాజయమే మిగులుతుంది.
సేకరణ: మోదుగ బాలసుబ్రహ్మణ్యం, గుంటూరు.