మనిషితనం

  • 1904 Views
  • 11Likes
  • Like
  • Article Share

మనిషితనం

ఓ జంట తమ ఆర్నెల్ల చంటిపాపతో సహా విహారయాత్రకు బయల్దేరారు. మార్గమధ్యంలో ఓ పెద్ద హోటల్‌లో బసచేశారు. రాత్రిపూట పాప పాలకోసం గుక్కపెట్టి ఏడవడం ప్రారంభించింది. ఆ దంపతులు కూడా తెచ్చుకున్న పాలడబ్బా అప్పటికే ఖాళీ అయి పోయింది. దాంతో హోటల్‌ వాళ్ల దగ్గరికి వెళ్లి, ‘‘దయచేసి ఓ కప్పు పాలు ఇవ్వగలరా?’’ అని అడిగింది ఆ బిడ్డ తల్లి.
‘‘కప్పు పాలు రూ.యాభై అండీ... ఇవ్వమంటారా?’’ అన్నారు హోటల్‌ నిర్వాహకులు. ‘‘ఫర్వాలేదు.. ఇవ్వండి!’’ అని ఆమె పాలు తీసుకుని పాపకు తాగించింది.
తెల్లారి ఆ దంపతులు స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను చూడటానికి వెళ్లారు. ఇంతలో పాప మళ్లీ గుక్కపెట్టింది. చూట్టూ చూస్తే ఏ దుకాణాలూ కనపడలేదు. కొంచెం ముందుకు వెళ్తే రోడ్డు పక్కన ఓ టీకొట్టు కనిపించింది. అడిగితే వాళ్లు పాలు ఇచ్చారు. బొజ్జ నిండటంతో పాప హాయిగా బజ్జుంది. తర్వాత ‘‘పాలకు ఎంత?’’ అని టీకొట్టు వ్యక్తిని అడిగింది ఆ తల్లి. 
‘‘పసిపిల్లల కోసం ఇచ్చిన పాలకు డబ్బులు తీసుకోమండీ’’ అన్నాడతను నవ్వుతూ. ఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదు. అంతేకాదు ప్రయాణంలో పాపకు అవసరమవుతాయని మరికొన్ని పాలు కూడా డబ్బాలో పోసిచ్చాడు. 
అక్కడినుంచి బయల్దేరిన ఆ తల్లిలో అంతర్మథనం... ‘నిజంగా ఎవరు ధనవంతులు? అంతపెద్ద హోటల్‌ యజమానులా? లేక టీకొట్టు నడుపుకుంటున్న ఈ మామూలు మనిషా!? గొప్పతనం ఎందులో ఉంది... గుణంలోనా? లేక సంపదలోనా?’
* * *
చాలామంది సంపాదన యావలోపడి, తాము మనుషులమన్న సంగతే మర్చిపోతుంటారు. కానీ, ప్రతిఫలం ఆశించకుండా తోటివారికి చేసే చిన్నచిన్న సాయాలు... డబ్బు ఇచ్చే మజాను మించిన మంచి అనుభూతినిస్తాయి.
సేకరణ: తండా ప్రభాకర్‌గౌడ్‌
తొర్రూర్, వరంగల్‌ జిల్లా
 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు