ప్ర‌తిఫ‌లం

  • 1575 Views
  • 15Likes
  • Like
  • Article Share

ప్ర‌తిఫ‌లం

అతడు ఎడారిలో దారి తప్పిపోయాడు. కూడా తెచ్చుకున్న నీళ్లు రెండు రోజులపాటు కాపాడాయి. నడుస్తున్నాడు... దారి తెలియట్లేదు. నోరు పిడచకట్టుకుపోతోంది. ఎండమావులు తప్ప ఎక్కడా నీటిజాడల్లేవు. ప్రాణం డస్సిపోతోంది. జీవితం చరమాంకానికి చేరిందని తనకి అర్థమవుతోంది. ‘ఈ రాత్రి గడవదు.. రేపటి ఉదయం చూడను’ అనుకుంటున్నాడు. ఇంతలో దూరంగా ఓ గుడిసెలాంటిది కనబడింది. అది నిజమో? తన భ్రమో? నమ్మలేకపోయాడు.
      ఏమో! నిజమేనేమో! అక్కడ నీళ్లు దొరుకుతాయేమో! ఆఖరి ప్రయత్నం చేయాలనుకున్నాడు. శక్తిని కూడదీసుకున్నాడు. తడబడుతున్న అడుగులతో ముందుకు వెళ్లాడు. 
      అక్కడ నిజంగానే గుడిసె ఉంది. కానీ, ఎవరూ లేరు. పక్కనే ఓ నీటిపంపు కనిపించింది. అతనికి ప్రాణం లేచివచ్చింది. వెళ్లి పంపును కొట్టాడు. నీరు రావట్లేదు. శక్తినంతా ఉపయోగించి కొట్టాడు. ప్రయోజనం లేకపోయింది. నిరాశతో వెళ్లి, గుడిసెలో కూలబడ్డాడు. కళ్లు మూసుకుపోతున్నాయి. అనుకోని వరంగా అక్కడ మూలగా ఓ సీసా కనిపించింది. అందులో నీళ్లున్నాయి. ఆనందంగా గొంతు తడుపుకోబోయాడు. అంతలో దానికి అంటించి ఉన్న కాగితం మీదికి దృష్టిపోయింది. 
      ‘ఈ సీసాలోని నీటిని పంపులో పోయండి. అప్పుడు పంపు కొట్టండి. నీళ్లు వస్తాయి. దాహం తీర్చుకున్నాక, మళ్లీ ఈ సీసా నింపి పెట్టండి’ అని కాగితం మీద రాసి ఉంది. ఏం చేయాలో అతనికి అర్థంకాలేదు. ‘ఎంత కొట్టినా పనిచేయని పంపు, ఈ సీసాలోని గుక్కెడు నీళ్లు పోస్తే పనిచేస్తుందా? చేతిలో ఉన్న కాస్త నీటినీ అందులో పోసేస్తే... తర్వాత నీళ్లు రాకపోతే నా పరిస్థితేంటి?...’ ఎంతకూ అతని ఆలోచనలు తెగడం లేదు. చివరికి ఓ నిశ్చయానికి వచ్చాడు. సీసాలోని నీళ్లను పంపులో పోశాడు. తర్వాత దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. 
      ఆశ్చర్యం... పాతాళగంగ పైకి తన్నుకు వచ్చింది! దేవుడికి దండం పెట్టుకున్నాడు. కడుపారా నీళ్లు తాగాడు. తన నీళ్ల సీసాను నింపుకున్నాడు. గుడిసెలోని సీసానూ నింపి మళ్లీ అదే మూలనపెట్టాడు. అలా పెడుతున్నప్పుడే... గోడవారగా ఉన్న ఇంకో కాగితమేదో కనిపించింది. చూస్తే... ఆ ఎడారి రేఖాపటం (మ్యాపు). సంతోషం రెట్టింపైంది. తను ఎటువెళ్లాలో చూసుకున్నాడు... ఉత్సాహంతో ముందడుగేశాడు.  

* * *

      ఇవ్వడం నేర్చుకుంటేనే మనం ఏదైనా పొందగలం. చేసే పనిని నమ్మి చేస్తే, ఫలితం అదే వస్తుంది. 

సేకరణ: కె.గీతాదేవి,
భట్టుపల్లి, ఆదిలాబాద్‌ జిల్లా

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు