‘అంధ’ ప్రేమ

  • 296 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘అంధ’ ప్రేమ

గోపాల్, సుజాతలకు కొత్తగా పెళ్లయ్యింది. రోజులు చాలా ఆనందంగా గడుస్తున్నాయి. అయితే, ఎప్పుడూ ఒకేలా ఉంటే అది కాలం ఎందుకవుతుంది! కొన్నాళ్లకు సుజాతకి ఏదో అంతుచిక్కని చర్మవ్యాధి సోకింది. శరీరం, మొహం మీద మచ్చలు మొదలయ్యాయి. తాను అందవిహీనంగా తయారవడం చూసి భర్త ఎక్కడ బాధపడతాడో అనే ఆవేదన సుజాతలో పెరిగిపోయింది. ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ దుఃఖ సాగరంలో మునిగి ఉండేది. 
ఒకరోజు ఆఫీసు పనిమీద వేరే ఊరెళ్లిన గోపాల్‌ రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. అతని కంటి చూపు పోయింది. విషయం తెలిసి సుజాత చాలా బాధపడింది. కానీ, అది తమ మంచికే జరిగిందని భావించింది. తన వికృత ముఖం భర్తను ఇక బాధించదని మనసు నిమ్మలం చేసుకుంది. గోపాల్‌ అవసరాలన్నీ తీరుస్తూ అతణ్ని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టింది. 
      ఒకరోజు సుజాతకి తీవ్ర జ్వరం వచ్చింది. అది ఎంతకీ తగ్గకుండా ఆమెని అనంత లోకాలకి తీసుకెళ్లిపోయింది.  కర్మకాండలు అన్నీ ముగిసిన తర్వాత గోపాల్‌ తన మిత్రులతో కూర్చున్నాడు.
      ‘‘గోపాల్, ఇప్పుడు సుజాత లేదు. ఇక నిన్ను ఎవరు చూసుకుంటారు. నీ పనులు నువ్వు చేసుకోగలవా?’’ ఒక మిత్రుడు అడిగాడు.
      ‘‘మీకొక నిజం చెప్పాలి. నా చూపు పోలేదు. అలా నటించానంతే’’ అన్నాడు గోపాల్‌.
      మిత్రులంతా అవాక్కయ్యారు. ఆ విషయాన్ని నమ్మలేకపోయారు. కాసేపటికి తేరుకుని, ‘‘ఇన్నాళ్లూ గుడ్డివాడిగా ఎందుకు నటించావు. అంత అవసరమేంటి?’’ అని అడిగారు. 
      ‘‘సుజాత తనకొచ్చిన వ్యాధికన్నా, నేను తన మొహం చూస్తూ ఎక్కడ బాధపడతానో అని కుంగిపోవడం చూడలేకపోయాను. ఆమె మనసు తేలికపర్చాలని అలా నటించాను’’ అన్నాడు.
      భార్య పట్ల గోపాల్‌కి ఉన్న ప్రేమని చూసి మిత్రులందరూ అభినందించకుండా ఉండలేకపోయారు. 

సేకరణ: పెడిఘంటం ఉమామహేశ్వరరావు, బెంగళూరు

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు