మానవత్వం

  • 1211 Views
  • 1Likes
  • Like
  • Article Share

మానవత్వం

పళ్లు కొందామనుకున్న నాకు రద్దీగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఓ దుకాణం కనిపించింది. అందులో రకరకాల తాజా పళ్లున్నాయి. కానీ యజమాని ఎక్కడా లేడు. ధర రాసి ఉన్న కాగితాలు ఆయా పళ్ల మీద ఉన్నాయి. దుకాణం మధ్యలో ఓ అట్టముక్క వేలాడుతోంది. ‘అయ్యా! మా అమ్మకి ఆరోగ్యం బాలేదు. ఆమెను చూసుకోడానికి ఇంటిదగ్గర ఉండాలి. మీకు కావాల్సిన పళ్లు తీసుకుని దానికి తగిన డబ్బును ఈ గల్లాపెట్టెలో వెయ్యండి’ అని దాని మీద రాసి ఉంది.
      నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా అని నవ్వొచ్చింది. ఆ వ్యక్తిని ఒకసారి చూడాలనిపించింది. సాయంత్రం అతను డబ్బు తీసుకెళ్లడానికి వస్తాడు కదా అనుకుని వెళ్లిపోయి, ఆ సమయానికి తిరిగి అక్కడికి చేరుకున్నాను. యజమాని దుకాణం కట్టేసే పనిలో ఉన్నాడు. అతని దగ్గరికెళ్లి నన్ను పరిచయం చేసుకున్నాను. ‘‘నువ్వు ఎంత తెలివితక్కువ పని చేస్తున్నావో తెలుసా? పళ్లను ఎవరైనా ఊరికే తీసుకుపోతే! ఎవరైనా దొంగలు నీ గల్లాపెట్టెను ఎత్తుకెళ్తే’’ అని అడిగాను. 
      అతను చిరునవ్వుతో గల్లాపెట్టె తెరచి చూపించాడు. ఆశ్చర్యం! దాన్నిండా డబ్బు! దుకాణంలోని పళ్ల విలువ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుందది. ‘‘ఇటు చూడండి’’ అంటూ దుకాణంలోకి చూపించాడు. చీరలు, దుస్తులు, స్వెటర్లు, రకరకాల తినుబండారాలు... అన్నింటి మీదా ‘అన్నా, అమ్మకు మా తరఫున ఇవ్వండి’ అని రాసిన కాగితాలు. ‘‘ఏదైనా అవసరం అయితే ఫోన్‌చేయండి’’ అంటూ కొందరు నంబర్లు రాసిపెట్టారు.
      ‘‘అన్నా, అమ్మను నా ఆస్పత్రికి తీసుకురండి. నేను ఉచితంగా వైద్యం చేస్తాను’’ అని ఓ డాక్టర్‌ తన విజిటింగ్‌ కార్డు మీద రాసి దుకాణానికి వేలాడదీశాడు. 
      అదంతా చూసి నా కళ్లు అశృపూరితాలయ్యాయి. ‘సమాజమంతా స్వార్థం నిండిపోయింది. మానవత్వం మచ్చుకైనా కనిపించడంలేదు’ అన్న నా భావన పటాపంచలైపోయింది. మన చుట్టూ మంచితనం ఇంకా బతికే ఉంది. ముందు మన దృక్పథంలో మార్పు రావాలంతే!

సేకరణ: అయ్యగారి శ్రీనివాసరావు, విజయనగరం

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు