మానవత్వం

  • 375 Views
  • 0Likes
  • Like
  • Article Share

మానవత్వం

ఒక యువకుడు ఏటా జరిగే సదస్సుకు నగరానికి చేరుకున్నాడు. పగలంతా చర్చలు, సమావేశాలతో గడిపి అలసిపోయి హోటల్‌ గదికి వచ్చాడు. విపరీతంగా ఆకలి వేయసాగింది. స్నానం ముగించి భోజనం చెయ్యడానికి దగ్గరలో ఉన్న రెస్టరెంట్‌కు వెళ్లాడు. 
      ఆ ప్రాంతం చాలా పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంది. తనకు నచ్చిన వంటకాలు తెప్పించుకుని తినబోయే ముందు అలా రెస్టరెంట్‌ బయటికి చూశాడు. 
      అద్దాల అవతల నుంచి ఆకలితో ఉన్న రెండు కళ్లు దీనంగా లోపలి వైపు చూస్తున్నాయి. ఆ బాలుడి వయసు పదేళ్లు ఉంటుందేమో. మురికిపట్టి చిరిగిన దుస్తులతో, దుమ్ముపట్టిన జుత్తుతో బక్కచిక్కి ఉన్నాడు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. ఆకలి బాధ అతని కళ్లలో కెరటంలా ఎగసిపడుతోంది. 
      ఆ పిల్లాణ్ని చూడగానే యువకుడి మనసు చలించిపోయింది. 
      తన ఆకలి సంగతి మరచిపోయి, వెంటనే లేచి బయటికి వెళ్లాడు. ఆ పిల్లాడి పక్కన అతని చెల్లెలు అదే స్థితిలో ఉంది. 
      ఇద్దరినీ తనతో పాటు లోపలికి పిలిచాడు. వాళ్లిద్దరూ మొదట భయపడ్డారు. లోపలికి రావడానికి తటపటాయించారు. కానీ, ఆకలి వల్ల వచ్చిన తెగింపు వల్లో, ఆ యువకుడి కళ్లలో కనిపించే ఆప్యాయత చూసో మెల్లగా లోపలికి వచ్చారు.  
      వాళ్లని తన టేబుల్‌ దగ్గర కూర్చోబెట్టుకుని తెప్పించుకున్న భోజనాన్ని వాళ్ల వైపు నెట్టాడు.
      ఇద్దరూ ఆత్రంగా తినడం మొదలుపెట్టారు. అతను మరికొన్ని వంటకాలు తెప్పించాడు. 
      పిల్లలిద్దరూ తృప్తిగా కడుపునిండా తిన్నారు. 
      ఆ యువకుడి కడుపూ, మనసూ రెండూ నిండిపోయాయి. 
      వెయిటర్‌ బిల్లు తెచ్చిచ్చాడు. 
      దాన్ని చూసిన యువకుడు ఆశ్చర్యపోయాడు. నమ్మలేనట్టు దాన్నలాగే కాసేపు చూస్తుండిపోయాడు. 
      అతని కంట్లోంచి నీటి బిందువు జారుతుండగా కౌంటర్‌ దగ్గర కూర్చున్న వ్యక్తి వైపు చూశాడు. 
      అతను చిరునవ్వుతో ఆ యువకుణ్నే చూస్తున్నాడు. ‘నీలాగా మానవత్వం ఉన్నవాళ్లు చుట్టూ చాలా మందే ఉన్నారు’ అన్నట్టుందా నవ్వు. 
      యువకుడు మరోసారి బిల్‌వైపు చూశాడు. దాని మీద ఇలా రాసి ఉంది..
      ‘మానవత్వానికి బిల్లు వేసే యంత్రాలు ఇక్కడ లేవు’

- సేకరణ: అంబల్ల జనార్దన్, ముంబయి

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు