గాయం

  • 502 Views
  • 0Likes
  • Like
  • Article Share

గాయం

ఒక రైతు దగ్గర బలిష్ఠమైన ఎద్దు ఉండేది. అది చాలా శాంతంగా, రైతు చేయించే పనులు ఇష్టంగా చేస్తుండేది. రైతు కూడా దాన్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. దాని ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేసేవాడు కాదు. దాని గురించి అందరికీ గొప్పగా చెప్పేవాడు. 
      ఒకసారి ఊళ్లో నలుగురితో మాట్లాడుతూ ‘‘నా ఎద్దు నూరుబండ్లను ఒకేసారి లాగేస్తుంది. కావాలంటే వెయ్యి నాణేలు పందెం’’ అన్నాడు. కొందరు పందేనికి దిగారు. వరుసగా నూరు బళ్లను ఒకదాని వెనుక ఒకటి కట్టారు. మొదటి బండికి ఎద్దును కట్టేశాడు రైతు. ఎద్దుకు అదంతా కొత్తగా ఉంది. చుట్టుపక్కల వాళ్లు లాగు లాగు అంటున్నారు. కానీ, యజమాని ఏ ఆదేశం ఇవ్వకపోవడంతో ఎద్దు ముందుకు కదల్లేదు. రైతుకు తల తీసేసినట్లయ్యింది. పందెం ఓడిపోయానన్న కోపంతో ఎద్దుని చర్నాకోలతో చావబాదాడు. సాయంత్రం చూస్తే ఎద్దు మేత మేయకుండా ఉంది. దాని గాయాల మీద ఈగలు ముసురుతుంటే దీనంగా రైతు వైపు చూస్తోంది. దాన్ని చూసి రైతు హృదయం ద్రవించింది. ఆ గాయాలకు మందు రాస్తుంటే, పందెంలో బండ్లు లాగాలని ఎద్దుని తాను ఆదేశించనట్లు గుర్తొచ్చింది. 
      ‘‘అయ్యో, ఎంత తప్పు చేశాను. అనవసరంగా ఎద్దుని హింసించాను’’ అనుకుని కళ్లనీళ్లు పెట్టుకుంటూ దాని తల మీద నిమిరాడు. యజమాని మనసు గ్రహించి ఎద్దు కొంచెం కుదుటపడింది. వారం తర్వాత రైతు మరోసారి పందెం కాశాడు, ఈసారి రెండువేల నాణేలు. ఈసారి అతను ఎద్దుని కొట్టలేదు. ప్రేమగా దాని వీపు మీద నిమిరి ‘‘లాగరా’’ అన్నాడు. అంతే, అవలీలగా వంద బళ్లను లాగిపడేసింది. తొందరపాటులోనో, చికాకులోనో, సరిగా అర్థం చేసుకోలేకనో ఒక్కోసారి మనం అభిమానించే, మనల్ని ప్రేమించేవాళ్లని ఇలాగే బాధపెడుతుంటాం. కానీ, ఒక్కక్షణం శాంతంగా ఆలోచిస్తే వాళ్ల మనసేంటో తెలుస్తుంది. అనురాగం వెల్లివిరుస్తుంది.  

    - సేకరణ: పరిమి శ్యామలా రాధాకృష్ణ, మదనపల్లె, చిత్తూరు జిల్లా

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు